14, ఫిబ్రవరి 2011, సోమవారం

తెలుగు లెస్స- పద్యం

తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స

23, జనవరి 2011, ఆదివారం

వాగు - నేను - కల

....................................................................... - పొన్నాల బాలయ్య


వేలు పట్టుకొని ఆత్మీయంగా
అరుకోషి - బురుకోషి ఆడిచ్చే
వాగు గుండెను నమ్రతతో తడ్మితే
మాతృత్వపు ఊటలు ఉప్పొంగుతూ
మది అంతరంగంలో నుర్గులు పొంగి
పదాల తెట్టు ప్రవహిస్తుంది.
మొయ్యన పారే అడుగుల అందెల సవ్వడే
పదాలల్లుకోవడం నేర్పింది.
పుట్టెడు ఉసికె మేటల మీద
ఆరబోసిన అక్షరాలలో పొర్లితే ...
వొంటికంటిన పంచవర్ణ పాదముద్రలే
బతుకు పుస్తకం మీద తడితడిగా తగుల్తయి.
గుండుమీద గుండు 'దొంతులోని' గుండెక్కి
గొంతు విప్పుకొన్న నీలిమేఘం
కుండపోతగా జ్ఞాపకాలను కుమ్మరిస్తు ...
మోయతుమ్మెద అలల మీద
మోదుగాకు పడవలో ఊహలు
పచ్చటి చెట్లమీద స్మ ృతి పతంగులై
రెపరెపలాడుతయి.
వంటికి రంగులద్దుకొన్న సింగిడి
పిల్లనగొయ్యి స్వరాలు పెదాలపై వన్నెలాడి
పురివిప్పిన బుగ్గల మీద రంగురాళ్ల
గంధం దిద్దుకుంటు రోమ రోమాన నెమలీకలు
చాటంత కండ్లతో తానమాడుతయి.
దమనుల్లోని పురాస్మ ృతులు మత్తడి దుంకి
తంగేడు పూల ఉసికె తెప్పల మీద
కట్టుకొన్న పిట్టగూళ్లు జర్రున జారి
మర్రి ఊడల కొసన వేలాడుతున్న ...
బాల్యం లోతు దొరకని చేపపిల్ల
మత్తడి శిఖరం నుండి మెత్తగా జారి
అలిసిన శరీరానికి ...
పక్క బొంతల్ల మగత నిద్రలో
హృదయాంతర నిర్మాణము
వాగు జలాలతో అనుసందానమై
జోల పాటలతో ఓలలాడిస్తుంది.
వాగుకు ఇరువైపుల పచ్చని చెట్లు
జట్లు జట్లుగా నీడనిస్తు ...
బురక పిట్టల బుర్రు బుర్రులు
అగ్గిపెట్టెలో దాసుకున్న బంగారి పురుగు
గుగ్గూగూ ... గుగ్గూగూ ... గుగ్గూగూ ...
బుడిబుడిగా వాలే తూనీగలు
గాలిలో ఎగుర్తున్న సీతాకోక చిలుక
రెక్కల ముఖం, పాలపిట్ట ఈకల అందాలతో
ప్రాణం ఖుషీగా అలుముకుంటది.
నాచుల దాచుకున్న కొర్రమట్ట - నీరుగట్టె
మడుగులో మత్తుగా నిద్రిస్తున్న కప్పపిల్ల
గుండె పొరల్ని నాజూగ్గా - స్పర్శిస్తు ...
వాగు వొడ్డుకు ఈత చెట్టమ్మ
నోట్లో దాసుకున్న తీపిపండ్లు
నాల్కలీరబోసుకున్న తాటిగొల రాల్చె
కమ్మని కల్లు బొట్లు కడుపునిండ తాగిన యాదులు
***
తడలు తడలుగా తన్నుకొచ్చె
వూరి దుఃఖపు కాల్వలు కల్సెచోట
జీవన పోరాట అంతిమ యాత్రలో
దింపుడు కల్లంలో దిగుల్తో దుఃఖిస్తు ...
జీవన మరణ రహస్యాలను
మౌనంగా పరీక్షించె వాగు ...
కొండపాకగట్లు 'సింగరయ్య లొద్ది' దాక
అనామత్‌గా రెక్కలు కట్టుకొని ఎగిరే జీవాత్మ
అద్దుమరాత్రి కలికి గాంధారి యాల్ల
బసవన్న కట్టెకొరకని సమయాన
వాగుపుట్టువడి గిరాయిపల్లి అడివిలో
పచ్చని కలలను కాలుస్తున్న శబ్దం ...
నెత్తిమీద ఖడ్గాలు మొల్సిన చెట్లను
కసితో నరుకుతున్న అలికిడి ...
కారిన రక్తధారలె ...
తూర్పునెత్తుటి సూర్యుల ప్రవాహం
పౌరుషంగా పారే ఈ వాగులో
ఎన్ని బాలకిరణాలు ఎదురు ఈదెనో!
ఇప్పుడు నడివాగుల భగ్గునమండే సూర్యుడు
వొంటికి పెట్రోలు పోసుకొని
నిత్యం ... దహనమౌతున్న దృశ్యమే!

- పొన్నాల బాలయ్య
99089 06248


23-01-2011 Adivaram, Andra Jyothi