7, డిసెంబర్ 2010, మంగళవారం

మరో జన్మ ఉంటే!

నాకు మరో జన్మ ఉంటే , విలోమంగా జీవించాలి
సమాధిలో మృత్యువుతో నా కొత్త జన్మ ప్రారంభం కావాలి
వృద్ధాప్యంతో ఒంటరి నులకమంచం మీద కళ్లు తెరవాలి
రోజులు గడుస్తున్నకొద్దీ,
కొంచెం కొంచెంగా, నెమ్మది నెమ్మదిగా
జవసత్వాలు పుంజుకోవాలి!
ఉన్నట్టుండి రోజు నులకమంచాన్ని మూలకుతన్ని
ట్రెజరీకి పోయి నా నెలవారీ పింఛన్ నేనే తెచ్చుకోవాలి!
ఒకరోజు, కొత్త బంగారు గడియారం బహుమతిగా పొంది
సన్మానం అందుకుని మరీ ఉద్యోగంలోకి అడుగుపెట్టాలి.
రోజువారీ కష్టాలు, ఇబ్బందులు ఉండవు
ప్రతిరోజూ సంతోషంగా
కొత్త కష్టాల నుండి బయటపడడం మాత్రమే ఉంటుంది
నలభై సంవత్సరాల సర్వీసు తరువాత
మళ్లీ చిన్న సందర్భం,
స్నేహితులు, విందులు, ఆనందపు చిందులు
ఉద్యోగవిరమణా, కాలేజీ చదువు ఆరంభం
కాలేజీ .... హైస్కూలు
సగం పాంట్లతో అమాయకంగా ప్రాథమిక విద్య
పలకాబలపాలు, ఆటపాటలు
చిన్న చిన్న బెంచీలపై చదువు, అల్లర్లు
తరువాత తొమ్మిది నెలలు
అమ్మపొట్టలో
భగవంతుడిచ్చిన 'స్టైల్ ప్పా'
వెచ్చటిగది, నోటి దగ్గరకే
కోరుకున్నవన్నీ అందించే
ఆనందప్రదేశం
చివర్లో చిన్న కణంగా మారిపోవడం.

మూలం: ఊడీ అలెన్ (అమెరికన్ హాస్యనటుడు, రచయిత)
అనుసరణ: బుర్రా సాయిబాబు 92912 91751

05-12-10, ఆంధ్రజ్యోతి, ఆదివారం అనుబంధం నుండి..

ఎలిమినేషన్ జోన్


చావు తప్పదు
ఒక్కడుగు వెనకా ముందూ అయినా
కంటిరెప్పల మధ్య కత్తుల్ని వదిలేసినా
విన్యాస ఉధృతిలో ఒక్క భంగిమ వికటించినా
తన్మయధార నడుమ తాళం తడబడినా
వేదిక మీదే చావు తప్పదు

*

సాంస్కృతిక సంపదను కొల్లగొట్టడమెలాగో
వాడికి బాగా తెలుసు
'ఆట'లో అరిగిపోయిన మాటల్నే అచ్చోసి
దేశం మీదికి వదుల్తాడు
పల్లెల్ని జల్లెడ బట్టి పట్టణాల్లో మేళాలు బెట్టి
నగరంలో నగారా మోగిస్తాడు
ప్రకటనల వెల్లువలో పకడ్బందీ స్క్రీన్ప్లేతో
ఎపిసోడ్లను కుమ్మరిస్తాడు
ఇంట్లో మనుషుల మధ్య మాటల్ని మాయం చేస్తాడు
కుదిమట్టంగా లేచిన గోడల మధ్య
కదలకుండా కన్నార్పకుండా
శరీరాల్ని కూర్చోబెట్టడమెలాగో వాడికి తెలుసు

*

లేజర్ కాంతుల్లో వెలిగిపోయే వేదిక మీద
ఎక్కడా సహజావరణ కాంతి ప్రసరించదు
కల్పిత కరతాళధ్వనుల నడుమ తెరలేస్తుంది
పుక్కిటపట్టి వచ్చిన మాటల్ని
వాడు అత్యంత అసహజంగా ఉచ్ఛరిస్తాడు
సెలబ్రిటీలూ గ్లామర్ గాళ్సూ న్యాయనిర్ణేతలు
ఆట మొదలవుతుంది
ప్రేమపాటల కుంభవృష్టిలో చిన్నారులు తడిసి ముద్దవుతారు
ఆరేళ్ల పాప 'పదహారు'లా హొయలు పోతుంది
శరీరాన్ని విల్లులా వంచి
'ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా
మూడొస్తే ముద్దులు పెడతా' నంటుంది
విఫలప్రేమలూ విరహబాధలూ వేదికనెక్కుతాయి
వికృత విషాద భంగిమలపై
పెద్దల ప్రశంసలు ప్లాస్టిక్ వ్యర్థాల్లా గుట్టలు పడతాయి
ఎంత ఎత్తు నుంచి దూకితే అంత నాట్యప్రమాణం
ఎన్ని దెబ్బలు తగిలించుకుంటే అన్ని మార్కులు బోనస్
చావుకీ బతుక్కీ మధ్య సరిహద్దు రేఖలు చెరిగిపోతాయి
ప్రత్యర్థుల «ధ్య మాటలమంటలు గుప్పుమంటాయి
ఎక్కడెక్కడో రెక్కలు విప్పిన ఎస్సెమ్మెస్ పక్షులు
ఎగురుకుంటూ 57575 గూటికి చేరుకుంటాయి
వాడే గిల్లి, కజ్జాలు పెట్టి దృశ్యాన్ని రసబీభత్సం చేస్తాడు
ఎలిమినేషన్ రౌండ్లో ఎంత నిబ్బరంగా నిలబడిన పసిమనసునైనా
నిర్దాక్షిణ్యంగా ఏడిపించడమెలాగో వాడికి తెలుసు

*

రేపోమాపో వికార దృశ్య శకలాలన్నీ
ఎలిమినేషన్ జోన్లో నిలబడక తప్పని ముద్దాయిలే!

- ఎమ్వీ రామిరెడ్డి
98667 77870
‌‌‌


05-12-10, ఆంధ్రజ్యోతి , ఆదివారం అనుబంధం నుండి..